• Home »
  • Flash »
  • తెలంగాణలో పెధాయ్ ప్రభావం

తెలంగాణలో పెధాయ్ ప్రభావం

పెథాయ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఈదురుగాలులకు ప్రజలు అల్లాడిపోయారు. ఏపీని వణికించిన చలిగాలులు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపాయి. హైదరాబాద్‌లోనూ బలమైన చలిగాలులు వీచాయి. దీంతో ప్రజలు ఆరుబయటకు రావడానికే భయపడ్డారు. రాకాసి తుఫాన్ పెథాయ్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లలో, కల్లాలలో ఉంచిన ధాన్యం తడిసిముద్దైంది. దీంతో రైతులు కంటతడి పెట్టారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాపితంగా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల వర్షపు జల్లులు కురుస్తుండగా పంటలకు నష్టం వాటిల్లుతోంది.

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి జల్లులతో పాటు చల్లని గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు. వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట, మడికొండ, గీసుకొండ, పరకాల ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. పెథాయ్ కారణంగా ఖమ్మం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పంట కోతకు వచ్చిన సమయంలో కురుస్తోన్న ఈ వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఐకేపీ కేంద్రాల్లో వద్ద ధాన్యంపై పట్టాలు కప్పి ఉంచారు.