• Home »
  • Flash »
  • ఆకట్టుకొని కమల్ ‘విశ్వరూపం -2 (మూవీ రివ్యూ)

ఆకట్టుకొని కమల్ ‘విశ్వరూపం -2 (మూవీ రివ్యూ)

రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షానూ  జాన్‌ వర్గీస్‌,

బ్యాన‌ర్‌: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌

నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌

విడుదల : ఆగస్టు 10, 2018

2013 లో ‘విశ్వరూపం’ ఫేమ్ స్పై మాస్టర్ కమల్ హాసన్ దీని సీక్వెల్ తీయాలని బాధ్యతగా ఫీలై, ఐదేళ్ళ తర్వాత ఆ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఆయన బాధ్యత తీరిపోయింది. ఇక చూసి తరించే బాధ్యత ప్రేక్షకులకే వుంది. ఒకసారి ఈ ‘రూపం’ చూస్తే, రేపు రాజకీయాలని కూడా ఆయన ఇలాగే  డెలివరీ చేస్తారా అని తమిళ సోదరులకి దిగులు పట్టుకోవడం ఖాయం. ఈలోగా ఇండియన్ – 2 (భారతీయుడు-2) విడుదలైతే కొంత ఉపశమనం పొందుతారేమో. అంతవరకూ విశ్వరూపం -2  దుస్స్వప్నంలా వెంటాడుతుంది. అసలు కమల్ హాసన్ ఎందుకని సీక్వెల్ తీయాలని బాధ్యతగా ఫీలయ్యారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ 
స్పై మాస్టర్ మేజర్ విసామ్ అహ్మద్ కశ్మీరీ అలియాస్ విస్ (కమల్ హాసన్) ఒక ఇంటర్నేషనల్ ఆపరేషన్ మీద బయల్దేరతాడు. వెంట భార్య నిరుపమ (పూజా కుమార్). కొలీగ్ అస్మిత (ఆండ్రియా) వుంటారు. అల్ ఖాయిదా టెర్రరిస్టు ఒమర్ లండన్లో పేలుళ్ళకి పథకం వేశాడు. దీన్ని విస్ నిరోధించాలి. రెండో ప్రపంచయుద్ధంలో మునిగిపోయిన నౌకలో భారీ యెత్తున వుండిపోయిన పేలుడు పదార్ధాలని యాక్టివేట్ చేసి లండన్ ని ధ్వంసం చేయాలనీ ఒమర్ పథకం. విస్ దీన్ని దిగ్విజయంగా అడ్డుకుని తిరిగి ఢిల్లీ వచ్చేస్తాడు. తన పథకానికి గండి కొట్టడాన్న కోపంతో ఒమర్ ఢిల్లీ వచ్చి, నిరుపమ, అస్మితలని కిడ్నాప్ చేస్తాడు. ఢిల్లీని ధ్వంసం చేయాలనీ ఇంకో పథకమేస్తాడు. ఇప్పుడు విస్ దీన్నెలా ఆడ్డుకుని, అతివ లిద్దర్నీ కాపాడుకుని, ఒమర్ ని అంతమొందించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 

పైన చెప్పుకున్న విధంగా చూస్తే సింపుల్ గానే  అన్పించే కథ. ఇలాటి హై కాన్సెప్ట్ యాక్షన్ కథలు సింపుల్ గానే వుంటాయి. ఈ సింపుల్ లైన్ మీద భారీ యాక్షన్ ని లోడ్ చేస్తారు. అప్పుడా సింపుల్ లైనుతో ఆ భారీ విజువల్ యాక్షన్ హంగామా ఉర్రూతలూ గిస్తుంది ప్రేక్షకుల్ని. ‘టర్మినేటర్’ దగ్గర్నుంచి ఇలా మొదలైంది. ఇలా కాక, భారీ యాక్షన్ కి తోడూ, కథని కూడా భారీగా లోడ్ చేస్తే, చూసే ప్రేక్షకుల మెదడు భరించలేదు. కథ భారీ, యాక్షన్ భారీ అంటే బుర్ర వాచిపోతుంది. ఈ రచన  చేసి, దర్శకత్వం వహించిన కమల్ హాసన్ ఇది పట్టించుకోలేదు. తన పాత్ర గురించి ‘విశ్వరూపం’ లో చెప్పకుండా అట్టి పెట్టిన పాత విషయాలు ఇందులో వెళ్ళబోసుకున్నారు. ‘విశ్వరూపం’ లో ఏమేం జరిగాయో ఆ జ్ఞాపకాల ఫ్లాష్ బ్యాకులు – భారీ యాక్షన్ సీన్స్ సహా పెట్టుకున్నారు. భార్యతో ఫ్యామిలీ సెంటి మెంట్లు పెట్టుకున్నారు, జ్ఞాపక శక్తి నశించిన తల్లితో మదర్ సెంటిమెంటు పెట్టుకున్నారు. మళ్ళీ దాని తాలూకు జ్ఞాపకాలు తెప్పించే ఫ్లాష్ బ్యాకులు దండిగా వేసుకున్నారు. ఏదేది చేయకూడదో అవన్నీ, ఎంతెంత చేయకూడదో అంతకిమించీ, చల్ మోహన రంగా అంటూ చేసుకుపోయారు. అసలు ఏది ఎందుకు జరుగుతోంతో, ఎందుకు జరగడం లేదో అర్ధంగానంత గజిబిజి గందర గోళం సృష్టించారు. మొదటి అరగంటకే ఆరోగ్యవంతులైన ప్రేక్షకుల ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) నశించడం మొదలెడుతుంది. చిట్ట చివరి వరకూ భరించి పేషెంట్ లా మిగిలితే ఎలాగో బయటి కొస్తారు, లేకపోతే లేదు. ఆధార్ కార్డు చెల్లిపోతుంది.

ఎవరెలా చేశారు

2015 లో ‘చీకటి రాజ్యం’ లో కమల్ వయసు మీద పడి, అలసి పోయి కన్పించారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా చాలా యాక్టివ్ గా వున్నారు. యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా థ్రిల్లింగ్ గా చేశారు. ఎగిరి దూకడం, పడిపోవడం అన్నీ. స్కూబా డైవ్ కూడా. అయితే వీటన్నిటికీ అడ్డు పడుతోంది అర్ధంపర్ధం లేని ‘విశ్వరూపం’ తాలూకు పాత లగేజీయే. ఆ ఉపోద్ఘాతాతలూ, పొట్టి కథలే. ‘ఏం, స్పై మాస్టర్ కి  ఫ్యామిలీ వుండకూడదని రూలుందా?’ అని డైలాగు కొడతారు ఒకచోట. వుంటే ఏమవుతుందో ప్రేక్షకులు అనుభవిస్తున్నారుగా. స్పై క్యారెక్టర్ కలర్ఫుల్ గా, గ్లామరస్ గావుంటాడు. వెంటబడే అందాల బొమ్మలుంటారు. హ్యూమరస్ గా యాక్షన్ చేసుకుపోతాడు. విలన్ కూడా అంతే కలర్ఫుల్ గా, హైప్రొఫైల్లో వుంటాడు. మిగతా వాటి నుంచి డిఫరెంట్ గా వుండాలని,  ఇలా స్పై జానర్ కి కొన్ని ప్రత్యేకతల్ని కల్పించారు జేమ్స్ బాండ్ ల కాలం నుంచీ. కమల్ ఇది యుగాంతమని ఫీలైపోయినట్టు, తోచిందల్లా పెట్టేసి, అన్నీ కలిపేసి – ఇదే ప్రపంచానికి చిట్టచివరి సినిమా అన్నట్టు తీసేస్తే ఎలా?

హీరోయిన్లు ఎందుకున్నారో తెలీదు. చివర్లో కిడ్నాప్ అవడానికి వున్నట్టుంది. టెర్రరిస్టుగా  రాహుల్ బోస్ అరిగిపోయిన పాత్ర. ఇంకా టెర్రరిజాలు అరిగిపోయిన కథలు. యాక్షన్ సీన్స్ మాత్రం హాలీవుడ్ రేంజిలో తీశారు, కథని మాత్రం తమిళ మసాలా చేశారు. సంగీతం ఓ మాదిరిగా వున్నా,  సాంకేతిక విలువలు బావున్నాయి. కానీ సాంకేతిక అద్భుతాలే సినిమా కాదుగా?

చివరికేమిటి?

‘విశ్వరూపం’ ముగింపులో, ఇంకా మిగిలున్న టెర్రరిస్టు ఒమర్ ని చంపుతా నంటారు కమల్. ఆ చంపే బాధ్యతే ఫీలయ్యి ఈ సీక్వెల్ నంతా తీసుకుంటూ పోయారు. ఈ ప్రయత్నంలో కాస్తా ప్రేక్షకుల్ని చంపారు. ఇక ఎన్నికల్లోగా ప్రేక్షకుల్లో తన ఓటర్లని గుర్తించి, ఫ్రెష్ ఓటర్ కార్డులిప్పించి, లేపే బాధ్యత మీద పడింది. ఒమర్ జిందాబాద్!

రేటింగ్: 1.5 / 5