కాకి సందేశం

చాలా మంది ఆహార పదార్థాలు తినేసి వాటి కాగితాలను, చెత్తను రోడ్ల మీదే పడేస్తుంటారు. దీని వల్ల మన పరిసరాలను మనమే చేతులారా పాడుచేసుకుంటున్నాం. కానీ, ఇక్కడ మాత్రం కాకులు చెత్తను ఏరేస్తున్నాయి. మనుషులు చెత్తవేసి పర్యావరణాన్ని పాడుచేస్తుంటే.. అవి మాత్రం శుభ్రం చేస్తున్నాయి. చెత్తను నోటకరుచుకుని తీసుకెళ్లి చక్కగా డస్ట్‌బిన్‌లో పడేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అవి చేసే పని చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది.
ఫ్రాన్స్‌లోని పై డూ ఫ్యూ అనే థీమ్‌ పార్క్‌లో చెత్తను శుభ్రం చేసేందుకు కార్మికులు ఉండరు. వారి స్థానంలో కాకులు కనిపిస్తాయి. ఆరు కాకులు ఈ థీమ్‌ పార్క్‌లోని చెత్తను శుభ్రం చేస్తాయి. సందర్శకులు వేసే చెత్తను ఒక్కొక్కటిగా తీసుకెళ్లి చక్కగా చెత్తబుట్టలో వేస్తాయి. సిగరెట్‌ పీకలు, చిన్న చిన్న ప్యాకెట్లు, కాయలు, విత్తనాలు ఇలా అన్నింటినీ నోట కరుచుకుని తీసుకెళ్లి ఓ చిన్న పెట్టెలో వేస్తాయి. వాటిని వేయగానే కాకి కోసం కొన్ని నగెట్స్‌ బయటకు వస్తాయి. అలా చెత్త ఏరివేసేందుకు ఆరు కాకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట.

‘మనుషులు చెత్తను ఇష్టం వచ్చినట్లుగా పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేసి వెళ్తుంటారు. కనీసం వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందనే విషయాన్ని మరిచిపోతారు. అందువల్లే కాకులతో ఇలా చేయిస్తున్నాం. కనీసం వాటిని చూసి అయినా పర్యావరణానికి హాని కలిగించకుండా మసలుకోవాలని కాకుల ద్వారా సందేశం ఇస్తున్నాం’ అని పార్క్‌కు చెందిన అధికారి నికోలస్‌ డివిలయర్స్‌ చెప్పుకొచ్చారు.