ఆరడుగులు ఉండాల్సిందే!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌… దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించి, ఇప్పుడు ఉత్తరాదిలోనూ మంచి అవకాశాలు కొట్టేస్తోంది. మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తోంది. ఈ బిజీ భామ తన ఇష్టాలూ, కెరీర్‌, ఫిట్‌నెస్‌ల గురించి చెబుతోందిలా..!

ఏం తింటానంటే!

ఉదయం వర్కవుట్‌కి ముందు బుల్లెట్‌ కాఫీ(ఒక స్పూన్‌ నెయ్యి కలిపిన కాఫీ) తాగుతా. వర్కవుట్‌ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్‌ లేదంటే ప్రొటీన్‌ పాన్‌కేక్‌లు తింటాను. కాకుంటే రాగి లేదా జొన్న రొట్టెలూ, ఉడకబెట్టిన గుడ్లూ తింటాను. షూటింగ్‌లో ఉంటే మధ్య మధ్యలో కొబ్బరి నీళ్లు, ఫ్రూట్స్‌, నట్స్‌ ఉండాల్సిందే. లంచ్‌… బ్రౌన్‌ రైస్‌, కాయగూరలూ, చికెన్‌ లేకపోతే ఫిష్‌ తీసుకుంటా. స్నాక్స్‌గా ప్రొటీన్‌ షేక్‌ లేదా పుడింగ్‌. డిన్నర్‌… ఎనిమిదింటి లోపలైతే రైస్‌, రోటీ తింటాను. ఆ టైమ్‌ దాటితే గ్రిల్డ్‌ చికెన్‌ లేదంటే ఫిష్‌తోపాటు కొన్ని కాయగూరలు తింటా.

ఓ వ్యాపారి…

మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుని వచ్చేశా. అప్పుడు ఎఫ్‌45 జిమ్‌లో వ్యాయామాలు చేసేదాన్ని. ఆస్ట్రేలియాకు చెందిన ఈ సంస్థ పాశ్చాత్య దేశాల్లో ప్రసిద్ధి చెందింది. కొత్త శాఖలు తెరవాలనుకుంటున్నట్టు తెలిసింది. వెంటనే నేను వాటి ఫ్రాంచైజీ తీసుకున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో ఒక జిమ్‌ని నిర్వహిస్తున్నాను. వీటిని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నా.

కాబోయేవాడు..

కాబోయే అబ్బాయి ఆరడుగులు ఉండాలి. నా ఎత్తు 5‘ 9‘‘. హీల్స్‌ వేసినపుడు నాకంటే ఎత్తుగా కనిపించాలంటే ఆ మాత్రం హైట్‌ ఉండాలిగా! అంతే కాదు, ఆడంబరాలకు పోకుండా సింపుల్‌గా ఉండాలి. టైమ్‌కి విలువ ఇవ్వాలి. నాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి.

రెండ్రోజులు నిద్రలేకున్నా…

కొద్దిరోజులుగా చెన్నై, హైదరాబాద్‌, ముంబయిల మధ్య విరామం లేకుండా తిరుగుతున్నా. అయినా నేను బాధపడను. నాకు పని ముఖ్యం. పనివల్ల ఒక్కోసారి 48 గంటలు నిద్రలేకపోయినా ఉండగలను. షూటింగ్‌లు లేనపుడు 16 గంటలైనా నిద్రపోగలను.

ఫిట్‌నెస్‌…

స్విమ్మింగ్‌, టెన్నిస్‌, బాస్కెట్‌ బాల్‌, స్కేటింగ్‌, కరాటే, గోల్ఫ్‌… ఇలా ప్రతిదాంట్లోనూ చిన్నపుడు నాకు శిక్షణ ఇప్పించారు. అలా చిన్నప్పట్నుంచీ ఫిట్‌నెస్‌ జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ ఒకేలాంటి వ్యాయామానికి శరీరాన్ని అలవాటు చేయకుండా నిత్యం మార్చుతుంటాను. ప్రస్తుతం బరువులు ఎత్తే పనిమీద ఎక్కువ దృష్టి పెట్టి జీవక్రియని మెరుగుపర్చుకుంటున్నాను. నాకంత తొందరగా అలసట రాదు. అందుకే అందరికంటే ఇంకాస్త ఎక్కువ వర్కవుట్‌ చేస్తా. శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. అంటే, వ్యాయామంతో మానసికంగానూ దృఢంగా తయారవ్వగలమన్నమాట.

ఆ అయిదు ‘ఎఫ్‌’లు…

ప్రస్తుతానికి ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాల్లో చేయాలనేది నా లక్ష్యం. దీర్ఘకాల ప్రణాళికలు లేవు. ఈరోజు ఏం చేయాలన్నదానిమీదే దృష్టి పెడతాను. ఫుడ్‌, ఫిల్మ్స్‌, ఫిట్‌నెస్‌… ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌… నన్ను ముందుకు నడిపించేవి ఇవే!

దిల్లీని మిస్సవుతున్నా…

సినిమా ప్రయత్నాల కోసం దిల్లీ వదిలి ముంబయి వెళ్లిన టైమ్‌లోనే అమ్మానాన్నా గురుగ్రామ్‌లో కొత్త ఇల్లు కొని అక్కడికి వెళ్లిపోయారు. తర్వాత నేను హైదరాబాద్‌ వచ్చేశాను. ఇప్పుడు ఏడాదిలో ఒకట్రెండు సార్లు గురుగ్రామ్‌ వెళ్తా, అప్పుడప్పుడూ అమ్మావాళ్లు ఇక్కడికి వస్తారు. కానీ దిల్లీలో నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి చాన్నాళ్లుగా వెళ్లలేదు. ధౌలాకువాలో చదువుకున్నాను. కాలేజీకి బంక్‌ కొట్టి ఖాన్‌ మార్కెట్‌లో తిరిగాను. ఆ ప్రాంతాలూ, అక్కడి స్నేహితులూ అన్నీ మిస్సవుతున్న ఫీలింగ్‌ ఉంది.

సెలవు దొరికితే…

బిజీ షెడ్యూళ్ల మధ్యలో కాస్త తీరిక దొరికినా విహారానికి వెళ్తా. గోవా, బాలి… నాకు ఇష్టమైన ప్రదేశాలు. కొన్నిసార్లు అంత టైమ్‌ ఉండదు. అప్పుడు ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో కాలక్షేపం చేస్తాను. పక్కన నచ్చినవాళ్లు ఉంటే ఎక్కడున్నా ఫర్వాలేదు.
rakul preet singh latest interview