• Home »
  • Cinema »
  • సమంత సలహాలు తీసుకుంటున్నా!

సమంత సలహాలు తీసుకుంటున్నా!

యువ కథానాయకులు నిర్మాణంవైపు దృష్టిసారిస్తున్నారు. నాగచైతన్య చేతిలో ఎలాగూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఉంది. కాబట్టి తనకు ఈ సౌలభ్యాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే ‘చి.ల.సౌ’ అనే చిత్రంలో భాగస్వామిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సుశాంత్‌ కథానాయకుడిగా నటించారు. మరో కథానాయకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన ‘చి.ల.సౌ’ సంగతులు.
ఈ సినిమాపై ఎందుకంత ప్రేమ పుట్టింది? సుశాంత్‌ నటించాడనా?
సుశాంత్‌ కోసం సినిమా తీసుకోలేదు. రాహుల్‌ రవీంద్రన్‌ సమంతకు మంచి మిత్రుడు. ఈ సినిమా చేయక ముందే వచ్చి కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తం అయ్యాక మళ్లీ కలిశాడు. సినిమా చూపించాడు. బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకి అన్నపూర్ణ లాంటి సంస్థ సహకారం ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకే.. నేనే నిర్మాతని అడిగి భాగస్వామిగా చేరాను.
‘చి.ల.సౌ’లో అంతగా నచ్చిన అంశాలేంటి?
ఒకరోజు జరిగే కథ ఇది. అమ్మాయి, అబ్బాయి కలుసుకోవడం, ఇష్టపడడం, వాళ్ల ప్రేమని పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించడం ఇవన్నీ ఒక్క రోజులో జరిగిపోతాయి. పెళ్లి విషయంలో యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించిందీ చిత్రం. అప్పట్లో పాతికేళ్లలోపు పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇప్పుడు ముప్ఫై దాటినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కొంతకాలం పోతే… అసలు వివాహ వ్యవస్థే ఉండదేమో. లేటు వయసులో పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల్ని సైతం చాలా బాగా, అందంగా చెప్పారు.

ఈ సినిమాలో భాగస్వామ్యం తీసుకోవాలని మీకు మీరే అనుకున్నారా? నాన్నగారినీ సంప్రదించారా?
నాకు నచ్చిన తరవాత.. నాన్నగారికి చెప్పా. ఆయనకూ బాగా నచ్చింది. అన్నపూర్ణ సంస్థలోగో ఇంకొన్ని మంచి చిత్రాలపై చూడాలని వుంది. మేం ఎంత కష్టపడినా యేడాదికి ఎక్కువ సినిమాలు చేయలేం. అందుకే ఇలా కొత్త ప్రతిభని ప్రోత్సహిస్తే బాగుంటుందనిపించింది. రాబోయే రెండు మూడేళ్లలో మా సంస్థ తరపున బయటి హీరోలతో సినిమాలు చేస్తాం. ‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్‌తో రెండు సినిమాలకు ఒప్పందం కుదిరింది.

సమంత కూడా మీ సినిమాల విషయంలో సలహాలు ఇస్తోందా?
సమంత సలహాలూ తీసుకుంటున్నా. ఎందుకంటే తను ఏం అనుకుంటే అది నిజాయతీగా చెప్పేస్తోంది. ‘ఈ పోస్టర్‌ బాగోలేదు… ఈ టీజర్‌ బాగోలేదు’ అని నిర్మొహమాటంగా అంటుంటుంది. నాన్నగారు కూడా అంతే. నా సినిమాని సైతం ఓ ప్రేక్షకుడిలా చూస్తారు. ఆయన సలహాలు తప్పకుండా తీసుకుంటుంటా. అవసరమైతే రీషూట్‌ చేయడానికి కూడా రెడీనే.

అగ్ర నిర్మాణ సంస్థలు చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఈ మార్పుకి కారణమేంటి?
మంచి సినిమాని ప్రోత్సహించడం చాలా అవసరం. సినిమా జీవిత కాలం మూడు రోజులే. టీజర్‌, ట్రైలర్‌ చూసి ఈ సినిమాకి వెళ్లాలా? వద్దా? అని నిర్ణయం తీసేసుకుంటున్నారు. అందుకే.. ప్రచారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. చిన్న సినిమాలకు అలా ప్రచారం చేసుకునే వీలు ఉండదు. కాబట్టి.. అగ్ర నిర్మాణ సంస్థలు ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మీ ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’ ఎంత వరకూ వచ్చాయి?
రెండూ దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ‘సవ్యసాచి’ ఓ కొత్త కథ. కథానాయకుడి ఎడమ చేయి తన మాట వినదు. దాని వల్ల ఏం జరిగింది? అనేది చాలా ఆసక్తిగా చెప్పారు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది.

రెండు సినిమాలకూ మధ్య విడుదల తేదీ విషయంలో క్లాష్‌ వచ్చిందని చెప్పుకుంటున్నారు?
అదేం లేదు. ‘సవ్యసాచి’ ముందు మొదలైంది. కాబట్టి అదే విడుదల కావాల్సింది. ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి..’ ఫస్ట్‌ కాపీలు త్వరలో సిద్ధం అవుతాయి. అవి చూసి, దేన్ని ముందు చేయాలి? అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తాం.

సమంత, మీరు మళ్లీ కలసి నటించబోతున్నారు.. ఆ సినిమా ఎలా ఉండబోతోంది?
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమది. పెళ్లయిన జంట కథ అది. ఇప్పటి వరకూ మేం ప్రేమకథలే చేశాం. ఈసారి భార్యాభర్తలుగా నటించబోతున్నాం. ఆ పాయింటే మకు కొత్తగా అనిపించింది. మా ఇద్దరికీ పెళ్లయిందని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను సమంతకు సైట్‌ కొట్టినట్టు నటిస్తే.. ఏం బాగుంటుంది? (నవ్వుతూ)

‘వెంకీ మామ’ సినిమా ఎప్పుడు?
సెప్టెంబరు, అక్టోబరులలో మొదలవుతుంది. వెంకీ మామతో కలసి నటించడం చాలా ఆనందంగా ఉంది.

తాతగారి బయోపిక్‌ ఎవరైనా తీస్తానంటే?
తీస్తే బాగుంటుంది. అయితే నేను మాత్రం ఆ పాత్ర చేయలేను. ‘మహానటి’లో ముప్ఫై సెకన్లు కనిపించడానికే భయపడిపోయాను. పూర్తి స్థాయిలో చేయడం చాలా కష్టం.